
స్టార్ల వైఫల్యం..
ఫస్ట్ టెస్ట్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తాము మిగతా టెస్ట్‌ల్లోనూ నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ (4+1) ఫార్మూలానే కొనసాగిస్తామన్నాడు. అంతేకాకుండా తుది జట్టులో పెద్దగా మార్పులు కూడా ఉండవనే హింట్ ఇచ్చాడు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభాన్ని అందించారు. రోహిత్ భారీ స్కోర్ బాకీ ఉండగా.. కోహ్లీ గోల్డెన్ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగిస్తుండగా.. రహానే తడబడుతున్నాడు. రిషభ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో భారత బ్యాటింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీలకు తోడు బుమ్రా మెరుపులు మెరిపించడంతో భారత్ ఫస్ట్ టెస్ట్‌లో పట్టు సాధించింది.

పుజారా ఔట్..
అయితే సెకండ్ టెస్ట్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. కానీ చతేశ్వర్ పుజారా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న పుజారా వరుసగా విఫలమవుతున్నాడు. అతని తడబాటు భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వరుసగా విఫలమవుతున్న పుజారాను పక్కన పెడతారా? లేక మరో అవకాశం ఇస్తారా? అనేది చూడాలి. ఒక వేళ పక్కపెడితే మాత్రం మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన విహారికే ఎక్కువ అవకాశాలుంటాయి. ఎందుకంటే.. మయాంక్ అగర్వాల్‌కు ఇటీవలే కంకషన్ ఇంజ్యూరీ అయింది. అతని గాయం తీవ్రత ఏంటో తెలియదు. పైగా అతను ఓపెనర్. ప్రస్తుత ఓపెనర్లు అయిన రోహిత్, రాహుల్ బాగా రాణిస్తున్నప్పుడు వారిని విడదీసే ప్రయత్నం చేయకపోవచ్చు.

ఆ నలుగురే..
ఆ తర్వాత కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్ వస్తారు. మళ్లీ ఏకైక స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాకే అవకాశం దక్కనుంది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కనుంది. ఈ నలుగురు ఫస్ట్ టెస్ట్‌లో దుమ్ములేపారు. బ్యాటింగ్ సామర్థ్యం ఉండటంతోనే శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ అతను ఫస్ట్ టెస్ట్‌లో బ్యాటింగ్‌లో రాణించలేదు. కానీ బౌలింగ్‌లో కీలక వికెట్లు తీశాడు. ఇక 9 వికెట్లతో బుమ్రా తన ఫామ్ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. షమీ కూడా పర్వాలేదనిపించాడు.

క్వారంటైన్‌లోనే సూర్య..
ఇక గాయపడ్డ ఆటగాళ్ల స్థానాల్లో బ్యాకప్ ప్లేయర్లుగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. వారి 10 రోజుల క్వారంటైన్ ఆగస్టు 13న ముగుస్తుంది. 14 నుంచి ప్రాక్టీస్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఇద్దరూ రెండో టెస్ట్‌లో బరిలో దిగే అవకాశమే లేదు. మూడో టెస్ట్‌కు అందుబాటులో వస్తారు. ఒకవేళ పుజారాకు ఇంకొ చాన్స్ ఇచ్చి అతను ప్రూవ్ చేసుకోకపోతే.. మూడో టెస్ట్‌లో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుంది. పుజారా ప్లేస్‌లో సూర్య అరంగేట్రం చేయవచ్చు.. లేక అనుభవం కలిగిన పృథ్వీ షాను ఓపెనర్‌గా దించి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించవచ్చు. ప్రస్తుత రెండో టెస్ట్‌కు అయితే వీరు అందుబాటులో లేరు.

సెకండ్ టెస్ట్.. భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా/హనుమ విహారీ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రవింద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా


Click it and Unblock the Notifications
