
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య క్రికెట్ మక్కా 'లార్డ్స్' వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి రోజు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం.. రెండో రోజు విరామం తీసుకొంది. ఇక మూడో రోజు పత్తా లేకుండా పోయింది. ఈ మూడు రోజుల పాటు ఆట సజావుగా సాగడంతో ఇరు జట్లు మంచి స్కోర్లు చేశాయి. దాంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. అయితే నాలుగో రోజు వర్షం గండం ఉందని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది.
కాకపోతే ఆటకు పెద్దగా అంతరాయం కలిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు చిరు జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. అంతేకాకుండా నాలుగో రోజు కొంతవరకు లార్డ్స్ మైదానాన్ని మబ్బులు కమ్మేస్తాయని, చల్లని గాలులు కూడా వీస్తాయని తెలిపింది. కనిష్టంగా 19 డిగ్రీలు, గరిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
అయితే ఇంగ్లండ్‌లో గత కొన్ని రోజులుగా వెదర్ ఫోర్‌కాస్ట్‌కు భిన్నంగా జరుగుతుంది. వాతావరణ శాఖ వర్షం వస్తుందంటే రావడం లేదు. రావడం లేదంటే వస్తుంది. ఫస్ట్ టెస్ట్ చివరి రోజు, సెకండ్ టెస్ట్ తొలి రోజు వర్ష సూచన లేదని పేర్కొనగా.. తీర సమయానికి వరణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. రెండో రోజు కూడా వాతావరణ శాఖ చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. మూడో రోజు మాత్రం వర్షం సూచనలేదని, ఎండ కాస్తుందని చెప్పింది. అన్నట్లుగానే జరిగింది. మరీ లండన్ వాతావరణ శాఖ చెప్పినట్లు నాలుగో రోజు వర్షం వస్తుందా? ఆట సజావుగా సాగుతుందా? అనేది చూడాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 7 ఫోర్లు 57) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది.
స్వల్పమే అయినా భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. అయితే ఇంగ్లండ్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలగడమే మూడో రోజు ఆటలో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్ జోరు చూపించినా... చివరి సెషన్లో చెలరేగిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. సహచరుల నుంచి చెప్పుకోదగ్గ సహకారం లభించకపోయినా కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో నిలవడం శనివారం ఆటలో హైలైట్ కాగా... టీమిండియా తరఫున సిరాజ్, ఇషాంత్ తమ ముద్ర చూపించారు.