
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య క్రికెట్ మక్కా 'లార్డ్స్' వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి రోజు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం.. రెండో రోజు విరామం తీసుకొంది. ఇక మూడో రోజు సైతం వర్షం సూచన లేదని, కనీసం మబ్బులు కూడా ఉండవని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా రెండో సెషన తర్వాత ఎండ కాస్తుందని తెలిపింది. కనిష్టంగా 17 డిగ్రీలు, గరిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
ఇక రెండో రోజు ఆట సజావుగా సాగగా.. భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో ఆధిపత్యం చెలాయించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 6 ఫోర్లతో 48 బ్యాటింగ్), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 129 ) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి.
అయితే ఇంగ్లండ్‌లో గత కొన్ని రోజులుగా వెదర్ ఫోర్‌కాస్ట్‌కు భిన్నంగా జరుగుతుంది. వాతావరణ శాఖ వర్షం వస్తుందంటే రావడం లేదు. రావడం లేదంటే వస్తుంది. ఫస్ట్ టెస్ట్ చివరి రోజు, సెకండ్ టెస్ట్ తొలి రోజు వర్ష సూచన లేదని పేర్కొనగా.. తీర వరణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. రెండో రోజు కూడా వాతావరణ శాఖ చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. మరీ లండన్ వాతావరణ శాఖ చెప్పినట్లు మూడో రోజు వర్షం రాదా? లేక వర్షంతో ఆటకు అంతరాయం కలుగుతుందా? అనేది చూడాలి.