ఆ ఒక్క ఓవరే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్
రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవరే తమ ఓటమిని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అయితే ఈ ఓటమికి అతన్ని నిందించనని, ఈ తప్పిదం నుంచి గుణపాఠం నేర్చుకుంటాడని తెలిపాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా విఫలమైన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ ఒక్క ఓవర్‌లోనే రవి బిష్ణోయ్ రెండు నోబాల్స్‌తో సహా 29 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో 191 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఛేదించింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది వరుసగా మూడో పరాజయం.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఓటమికి ఏ ఒక్క ఆటగాడి వైపు వేలెత్తి చూపించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. 15 ఓవర్ల వరకు మ్యాచ్‌పై తమకే పట్టు ఉందని చెప్పాడు. కానీ జాకోబ్ బెతెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయాన్ని లాగేసుకున్నాడని తెలిపాడు.

ఎవర్నీ బద్నాం చేయను..
'మ్యాచ్ ఎక్కడ చేజారిందో అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను ఏ ఒక్క ఆటగాడిని బద్నాం చేయాలనుకోవడం లేదు. తొలి నో-బాల్ తర్వాత అతను(రవి బిష్ణోయ్) బలంగా పుంజుకుంటాడని నేను భావించాను. కానీ ఆ 17వ ఓవర్ మమ్మల్ని బాగా దెబ్బతీసింది.
అయితే ఈ తప్పిదం నుంచి అతను నేర్చుకుంటాడు. అస్థిరమైన బౌన్స్ ఉన్న ఈ వికెట్‌పై మేం చేసిన స్కోరు మంచిదని నేను భావిస్తున్నా. తొలి 15 ఓవర్ల వరకు మ్యాచ్‌పై మాకే పట్టు ఉంది. కానీ అకస్మాత్తుగా .. జాకోబ్ బెతెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రౌండ్ కొలతలు, వికెట్ తీరును ముందే అంచనా వేశారు. సామ్ కరన్ తెలివిగా ఆఫ్ స్టంప్‌కు బయట బౌలింగ్ చేశాడు. అది చాలా బాగా వర్కౌట్ అయింది.
వైభవ్ ఫియర్‌లెస్ క్రికెటర్. అతను నెట్స్‌లో బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం. ఈ విషయంలో అతను నుంచి మేం నేర్చుకోవాల్సి ఉంది. తొలి మ్యాచ్ అనే కంగారు అతనిలో కనిపించలేదు. కంగారు పడతాడని కూడా నేను అనుకోలేదు. ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ మంచి జోష్‌లోనే ఉంటాను. అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరోకటి ఉండదని నాకు తెలుసు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

