
సెంచరీ చేయక 20 నెలలు..
విరాట్ కోహ్లీ చివరి సారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్‌లో విరాట్ (136) శతకం బాదాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీ చేయలేదు. సెంచరీ లేకుండా 2020ని ముగించాడు. దాంతో అతని సెంచరీల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2008 నుంచి 2019 వరకు కోహ్లీ ప్రతీ ఏడాది కనీసం ఒక్క సెంచరైనా బాదాడు. కానీ 2020లో మూడు ఫార్మాట్లో కలిపి ఒక్క శతకం బాదలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ 70 ప్లస్ రన్స్ చేసినా.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

ఇంగ్లండ్‌లోనైనా..?
ఆ తర్వాత తన తొలి సంతానం కోసం మధ్యలోనే భారత్‌కు తిరిగి వచ్చాడు. 2020-21 సీజన్‌లో 8 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 31.25తో 250 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 74. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఒక్క మ్యాచ్ ఆడిన కోహ్లీ 44, 13 పరుగులతో విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సమయాత్తం అవుతున్నాడు. కనీసం ఈసారైనా కోహ్లీ సెంచరీ సాధిస్తాడా? అని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య నేటి(బుధవారం) నుంచే టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

సెంచరీ బాదితే అరుదైన ఘనత..
ఈ సిరీస్‌లో కోహ్లీ తన బ్యాటింగ్‌తో పరుగులు వరద పారిస్తే.. ఓ క్రేజీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, కోహ్లిలు ఒకే స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో వీరిద్దరు 41 సెంచరీలతో టాప్‌లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా నిలవడానికి కోహ్లి మరో సెంచరీ చేస్తే చాలు.. పాంటింగ్‌ను అధిగమించి ఆ జాబితాలో టాప్‌లో నిలుస్తాడు.

2018 టూర్ పెర్ఫామెన్స్ రిపీట్ చేస్తే..
2014లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడిన కోహ్లీ ఆ టూర్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 5 టెస్ట్‌ల్లో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. అండర్సన్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు ఎక్కువగా ఔటయ్యాడు. కానీ 2018 పర్యటనలో మాత్రం దుమ్మురేపాడు. 5 టెస్ట్‌ల్లో 59.30 సగటుతో 593 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలున్నాయి. అయితే కోహ్లీ మాత్రం సెంచరీలు చేయకపోవడంపై ఎలాంటి ఆందోళన చెందటం లేదన్నాడు. ఫస్ట్ టెస్ట్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. తానెప్పుడు రికార్డులు, సెంచరీల కోసం ఆడనని తెలిపాడు. జట్టు విజయం కోసం మాత్రమే ఆడుతానని, టీమ్ విజయం సాధిస్తే సెంచరీ చేసినట్లే ఫీలవుతానని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












