ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. ఐదో రోజు ఆటలో ఫస్ట్ సెషన్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు వికెట్లు తీసినా.. ఫలితం లేకపోయింది. ఈ పరాజయం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని మండిపడుతున్నారు. టీమిండియా గెలిచినప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని కొనియాడి.. ఓడితే శుభ్‌మన్ గిల్‌ను నిందించడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా టెస్ట్‌ల్లో వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. జట్టు ఎంపిక సరిగ్గా లేకపోవడం, అనుభవం కలిగిన ఆటగాళ్లను తీసుకోకపోవడంతో టీమిండియా ఓటమిపాలైందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచింది. కానీ టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కోల్పోయింది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. గంభీర్ పర్యవేక్షణలో భారత్ గెలిచిన టెస్ట్ సిరీస్ ఒక్కటే. అది కూడా పసికూన బంగ్లాదేశ్‌పై 2-0తో గెలుపొందింది.

ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. గంభీర్ కారణంగానే ఈ ఇద్దరు తప్పుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటింది. 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ బౌలర్ల వైఫల్యం టీమిండియా విజయవకాశాలు దెబ్బతీసింది. లెఫ్టార్మ్ పేసర్ లేకుండా బరిలోకి దిగడం టీమిండియా ఓటమికి కారణమైందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోకుండా అతనిపై ఒత్తిడి చేయాల్సిందని కామెంట్ చేస్తున్నారు. గంభీర్ పెత్తనం కారణంగానే కోహ్లీ తప్పుకున్నాడని మండిపడుతున్నారు. కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేని శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వడం కూడా సరికాదని అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్ విభాగం మరీ బలహీనంగా ఉందని, బుమ్రా తప్పా అనుభవం కలిగిన బౌలరే లేడని మండిపడుతున్నారు. గంభీర్ తనకు నచ్చిన ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాడని, హర్షిత్ రాణాను తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గంభీర్ ఇలానే తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.