ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 6 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23.5 ఓవర్లలో 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(6 బ్యాటింగ్) ఉన్నాడు. వర్షం అంతరాయం కలిగించడంతో గంట ముందే అంపైర్లను ఆటను నిలిపేసారు. ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వర్షం భారీగా రావడం లేదని, ఆటను ముగించడం ఏంటని వాగ్వాదానికి దిగాడు. కానీ అంపైర్ మాత్రం మూడో రోజు ఆటకు ముగింపు పలికాడు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్(4)ను బ్రైడన్ కార్స్ ఆదిలోనే ఔట్ చేయగా.. నిలకడగా ఆడిన సాయి సుదర్శన్(30)ను బెన్ స్టోక్స్ ప్లాన్ చేసి మరి బుట్టలో వేసుకున్నాడు. నాలుగో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. ఈ ఒక్క సెషన్‌ను టీమిండియా జాగ్రత్త ఆడితే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేస్తోంది. 350 ప్లస్ టార్గెట్‌ను ఇంగ్లండ్ ముందుంచితే భారత్‌కు విజయం దక్కుతుంది. ఎందుకంటే నాలుగో ఇన్నింగ్స్‌లో 350 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం.

అంతకుముందు 209/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్(106) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్(2/122) రెండు వికెట్లు తీసాడు. చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా భారీ ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. భారత ఆటగాళ్లు దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా వేసిన నోబాల్‌తో బ్రూక్ డకౌటవ్వకుండా బచాయించాడు.
మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సెంచరీ హీరో ఓలి పోప్(106)ను ప్రసిధ్ కృష్ణ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు లేదు. హ్యారీ బ్రూక్‌కు జత కలిసిన బెన్ స్టోక్స్ ఆచితూచి ఆడాడు. స్టోక్స్ నెమ్మదిగా ఆడినా హ్యారీ బ్రూక్ వన్డే తరహా బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సిరాజ్ విడదీసాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్ సైతం దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దరూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను చెడుగుడు ఆడారు. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 327/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్‌లోనూ ఈ జోడీ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. దూకుడుగా ఆడిన జేమీ స్మిత్‌ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్‌పై జడేజా, సాయి సుదర్శన్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఆరో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే సెంచరీకి ఒక్క పరుగు ముంగిట హ్యారీ బ్రూక్(99) క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ ఆచితూచి ఆడి 8వ వికెట్‌కు 55 పరుగులు జోడించారు. బ్రైడన్ కార్స్(22)ను సిరాజ్ ఔట్ చేయగా.. క్రిస్ వోక్స్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. జోష్ టంగ్‌ను బుమ్రా ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది.