కొలంబో: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో బయట అంతే సరదాగా కనిపిస్తాడు. తన చిలిపి పనులతో అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లను నవ్విస్తాడు. స్టేడియంలోని సాంగ్స్‌కు కాలు కదుపుతూ ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు నకరాలు చేస్తే.. తనదైన శైలిలో బదులిస్తూ నోరు మూయిస్తాడు.
తాజాగా విరాట్ కోహ్లీ చేసిన ఓ పని ప్రేక్షకులతో పాటు అంపైర్లు, ఆటగాళ్లు, కామెంటేటర్లు విరగబడి నవ్వుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా ఐదు మార్పులతో బరిలోకి దిగింది.

వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బెంచ్ బలాన్ని పరీక్షించాలని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చింది. ఈ ఐదుగురి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీలను తీసుకుంది.
ఈ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చినా.. అతను 12వ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సేవలందించడంతో పాటు వాటర్ భాయ్ పాత్రలో సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తున్నాడు. వేల కోట్ల అధిపతి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ఏ మాత్రం నామోషి లేకుండా డ్రింక్స్ అందిస్తున్నాడు.
డ్రింక్స్ అందించడాన్ని కూడా కోహ్లీ తనదైన శైలిలో ఆస్వాదిస్తున్నాడు. ఈ మ్యాచ్ డ్రింక్స్ సమయంలో సిరాజ్‌తో కలిసి మైదానంలోకి కోహ్లీ డ్రింక్స్ పట్టుకొచ్చాడు. మైదానంలోకి వచ్చే క్రమంలో ఫన్నీగా రన్ చేస్తూ అందర్ని నవ్వించాడు. కోహ్లీని చూసి భారత ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ఫ్యాన్స్ కూడా కోహ్లీ చర్యకు ఫిదా అయ్యారు. ఏ పని చేసినా రాజు రాజేరా..! అంటూ కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(41 బ్యాటింగ్)తో పాటు హృదయ్(25 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్.. ఆదివారం శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.