సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. ఇప్పటికే ఈ టెస్ట్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై వేదికగా ఓ ప్రాక్టీస్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేసింది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లంతా చెన్నైకి చేరుకుంటున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ కూడా చెన్నైలో అడుగుపెట్టాడు. లండన్ నుంచి నేరుగా శుక్రవారం చెన్నైకి చేరుకున్న విరాట్ కోహ్లీ.. హోటల్ గదికి వెళ్లిపోయాడు.

18 నెలల తర్వాత..
దాదాపు 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై కింగ్ కోహ్లీ టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది మార్చిలో చివరిసారిగా ఇక్కడ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఆడేందుకు సన్నదమవుతున్నాడు.
శనివారం నుంచి ఇతర ఆటగాళ్లతో కలిసి కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశం ఉంది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఇతర ఆటగాళ్లు కూడా చెన్నైకి చేరుకున్నారు.
బంగ్లాకు దబిడి దిబిడే..
టెస్ట్‌ల్లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది. సొంతగడ్డపై 2019లో చివరిసారిగా ఇరు జట్లు పింక్ బాల్ టెస్ట్ ఆడగా.. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో ఇప్పటి వరకు 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 54.62 సగటుతో 437 రన్స్ చేశాడు.
ఇందులో ఓ సెంచరీతో పాటు డబుల్ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. అప్‌కమింగ్ సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీ చెలరేగుతాడని, బంగ్లాదేశ్‌కు దబిడి దిబిడేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
58 రన్స్ చేస్తే..
ఇప్పటికే టెస్ట్‌ల్లో అరుదైన ఘనతలను సాధించిన విరాట్ కోహ్లీకి మరో రికార్డు ఊరిస్తోంది. మరో 58 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు. సచిన్ 623 ఇన్నింగ్స్‌లో 27 వేల పరుగుల మైలు రాయి అందుకోగా.. కోహ్లీ 591 ఇన్నింగ్స్‌ల్లో 26,942 పరుగులతో ఉన్నాడు.
ఓవరాల్‌గా 27 వేలు కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఇప్పటి వరకు ముగ్గురే ఉన్నారు. సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్థానంలో ఉండగా.. కుమార సంగక్కర(28.016), రికీ పాంటింగ్(27,483) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.