బంగ్లాదేశ్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ అనుకుంటోంది.
దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. సూర్య మరో 31 పరుగులు చేస్తే టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన చేరుతాడు. అంతర్జాతీయ టీ20ల్లో 2500 పరుగుల మైలురాయి అందుకుంటాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన మూడో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కుతాడు.

సూర్య కంటే ముందు కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే అంతర్జాతీయ టీ20ల్లో 2500 పరుగుల మైలురాయి అందుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులు చేశాడు. అతని సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచింది. విరాట్ కోహ్లీ 4188 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఇప్పటికే 2,469 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటు 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత సూర్య టీ20 ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు.
సూర్య అసాధారణ ప్రదర్శనతో కెప్టెన్‌గా ఎదిగాడు. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. హార్దిక్ పాండ్యాను తప్పించి మరి సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టారు. అతని సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గతేడాది ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన సూర్య మళ్లీ అవకాశం అందుకోలేదు. టీ20ల్లో రాణించినట్లుగా.. ఇతర ఫార్మాట్లలో సత్తా చాటలేకపోయాడు.