ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన చర్యలతో నవ్వులు పూయించాడు. వికెట్ల వెనుకాల నుంచి ప్రత్యర్థి బ్యాటర్లపై తనదైన మాటలతో సెటైర్లు పేల్చాడు. రిషభ్ పంత్ జోక్స్‌కు కామెంట్రీ బాక్స్‌లో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. పంత్ హిందీలో అన్న మాటలను ఇంగ్లీష్‌లో చెబుతూ.. పడి పడి నవ్వుకున్నాడు.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన మోమినల్ హక్.. అశ్విన్ వేసిన 33వ ఓవర్‌లో తడబడ్డాడు. స్వీప్ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. దాంతో బంతి అతని ప్యాడ్లను తాకగా.. రిషభ్ పంత్ గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. పంత్ రివ్యూ తీసుకోవాలని సూచించాడు. అయితే అశ్విన్.. బంతి మోమినల్ హక్ బ్యాట్ తాకిందని చెప్పాడు. రిప్లేలో అదే విషయం స్పష్టమైంది.

అనంతరం మోమినల్ హక్ ఎత్తును ఉద్దేశించి రిషభ్ పంత్ సెటైర్లు పేల్చాడు. 'మోమినల్ హక్ హెల్మెట్‌కు బంతి తాకినా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయాలి'అని గట్టిగా అరిచాడు. ఈ మాటలతో పక్కన ఉన్న ఆటగాళ్లు నవ్వుకున్నారు. మోమినుల్ హక్ 5 అడుగుల 3 అంగులాల ఎత్తు మాత్రమే ఉంటాడు. పంత్ మాటలను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేషన్ చేసిన గవాస్కర్ పడి పడి నవ్వుకున్నాడు. నెటిజన్లు మాత్రం.. ఒక పొట్టోడి గురించి మరో పోట్టోడు మాట్లాడలని పంత్ ఎత్తును ఉద్దేశించి సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్‌మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. శనివారం కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించింది.