For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: శుభ్‌మన్ గిల్ శతకం.. భారత్ ఘన విజయం!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ వేటను టీమిండియా ఘనంగా ఆరంభించింది. గురువారం బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బౌలింగ్‌లో మహమ్మద్ షమీ 5 వికెట్లతో నిప్పులు చెరగగా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ శతక్కొట్టాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా.. ఆఖరివరకు క్రీజులో నిల్చొని విజయాన్నందించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు కుప్పకూలింది. టౌహిడ్ హృదయ్(118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100) సెంచరీతో రాణించగా.. జాకెర్ అలీ(114 బంతుల్లో 4 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/53) ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. హర్షిత్ రానా(3/31) మూడు, అక్షర్ పటేల్(2/43) రెండు వికెట్లు పడగొట్టారు.

IND vs BAN Shubman Gill Century helps India beat Bangladesh in Champions Trophy 2025

అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(36 బంతుల్లో 7 ఫోర్లతో 41), కేఎల్ రాహుల్(47 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.

అదిరిపోయే ఆరంభం..
సాధారణ లక్ష్యచేధనకు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా..ఆ తర్వాత వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. తంజిమ్ హసన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ కొట్టిన పుల్ షాట్ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దూకుడుగా ఆడే క్రమంలో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శుభ్‌మన్ గిల్ సెంచరీ..
పవర్ ప్లే అనంతరం భారత పరుగుల వేగం తగ్గింది. పిచ్ నెమ్మదిగా మారడంతో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కోహ్లీ అయితే 35వ బంతిని బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే లెఫ్టార్మ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ బౌలింగ్‌లో కోహ్లీ(22) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి అయ్యర్ రాగా.. శుభ్‌మన్ గిల్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్(15), అక్షర్ పటేల్(8) ఔటయ్యారు.

కేఎల్ రాహుల్‌తో కలిసి ఆచితూచి ఆడిన శుభ్‌మన్ గిల్ 125 బంతుల్లో సెంచరీ సాధించడంతో పాటు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జకేర్ అలీ నేలపాలు చేయడం టీమిండియాకు కలిసొచ్చింది. సిక్సర్‌తో రాహుల్ ఈ మ్యాచ్‌ను ముగించడం విశేషం.

Story first published: Thursday, February 20, 2025, 21:59 [IST]
Other articles published on Feb 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+