కొలంబో: ఆసియా కప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), టౌహిడ్ హృదయ్(81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది.
చివర్లో నసుమ్ అహ్మద్(44), మెహ్‌దీ హసన్(29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లోనే ఓపెనర్ లిటన్ దాస్(0)ను మహమ్మద్ షమీ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరసటి ఓవర్‌లో మరో ఓపెనర్ తన్జిద్ హసన్(13)ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన అనముల్ హక్(4)ను కూడా ఠాకూరే పెవిలియన్ చేర్చగా.. మెహ్‌దీ హసన్(13)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.
దాంతో బంగ్లాదేశ్ 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, టౌహిడ్ హృదయ్ బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిచింది. భారత ఫీల్డింగ్ తప్పిదాలు కూడా వారికి కలిసొచ్చాయి. ఈ క్రమంలో షకీబ్ అల్ హసన్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతం అతను అదే జోరు కొనసాగించగా.. హృదయ్ కూడా 77 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. 101 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన షకీబ్ అల్ హసన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన షమీమ్ హుస్సెన్‌ను జడేజా ఔట్ చేయగా.. హృదయ్‌ను మహమ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. చివర్లో నసుమ్ అహ్మద్, మెహ్‌దీ హసన్ 45 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా.. ప్రసిధ్ కృష్ణ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన నసుమ్ అహ్మద్(44)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
నసుమ్ ఔటైనా.. మెహ్‌దీ హసన్(29 నాటౌట్), తంజీమ్ హసన్ షకీబ్(14 నాటౌట్) రాణించడంతో బంగ్లాదేశ్ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయగలిగింది.