IND vs BAN: వారి వల్లే ఈ సెంచరీ: సంజూ శాంసన్
టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలవడంతోనే సెంచరీ సాధించానని వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగినా.. మేనేజ్‌మెంట్ అండగా నిలిచి అవకాశాలు ఇచ్చిందని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్.. తొలి రెండు మ్యాచ్‌ల్లో 29, 10 పరుగులే చేశాడు. అయినా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి మరో అవకాశం ఇచ్చాడు. ఈ ఛాన్స్‌ను సంజూ శాంసన్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సంజూ శాంసన్ శతక్కొట్టుడుకు టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేసి ఓటమిపాలైంది. టౌహిడ్ హృదయ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(25 బంతుల్లో 8 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు. విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన సంజూ శాంసన్.. టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలవడంతోనే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందని చెప్పాడు.
'నా శతకంతో మా డ్రెస్సింగ్ రూమ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. మా కుర్రాళ్లంతా నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇన్నింగ్స్ పట్ల నేను కూడా సంతృప్తికరంగా ఉన్నాను. ఎట్టకేలకు నేను రాణించినందుకు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. సుదీర్ఘ కాలంగా బ్యాటింగ్ చేస్తున్నా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ప్రతీ ఒక్కరు అసహనానికి గురయ్యారు.
నేను మెరుగ్గా రాణించాల్సింది. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్‌గా ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు బాగా తెలుసు. నేను చాలా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాను. వైఫల్యాలకు తగ్గట్లు నా మానసికస్థితిని ఎలా మలుచుకోవాలో బాగా తెలుసు. నా మనస్సుకు ఒక్కటే చెప్పుకునేవాడిని.. ప్రయత్నం చేస్తూనే ఉండాలని, నిరంతరం ట్రైనింగ్ చేస్తూ.. మనపై మనం నమ్మకం ఉంచితే అనుకూలమైన రోజు వస్తుందని అనుకునేవాడిని. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడి ఉండటం సహజం.
ఈ మ్యాచ్‌లో నేను సత్తా చాటాలనుకున్నాను. నేనేంటో తెలియజేయాలనుకున్నా. బేసిక్స్ మరిచిపోకుండా బంతిపై ఫోకస్ పెట్టి నా షాట్స్ ఆడాలని నాకు నేను చెప్పుకున్నా. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోచ్‌లు కూడా తరుచూ నా నైపుణ్యం గురించి గుర్తు చేసేవారు. గత సిరీస్‌లో నేను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాను. అప్పుడు నా పనైపోయిందని అనుకున్నా. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది.
ఈ సిరీస్‌కు ఎంపిక చేసి మరో అవకాశం ఇచ్చింది. నా ఇన్నింగ్స్‌తో మా కోచ్, కెప్టెన్ ముఖాల్లో చిరునవ్వు చూడటం సంతోషంగా ఉంది. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా. ఈ రోజు అది నెరవేరింది.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications