బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ అనుకూలంగా లేకున్నా భారత బౌలర్లు అద్భుతం చేశారని కొనియాడాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఫలితం అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా అటాకింగ్ అప్రోచ్‌తో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు బ్యాటర్లు రిస్క్ తీసుకొని ఆడటంతో విజయం దక్కిందని తెలిపాడు. ఫలితం కోసం 100 పరుగులకు ఆలౌటైనా పర్వలేదని భావించి దూకుడుగా ఆడామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. గౌతం గంభీర్‌తో పని చేయడంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి. కొన్నిసార్లు వేర్వేరు వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది. రాహుల్ భాయ్ వీడ్కోలు పలికాడు. అతనితో మేం అద్భుతమైన సమయాన్ని గడిపాం. అతను దూరమైనా జట్టుగా ముందుగా సాగుతున్నాం. గౌతమ్ గంభీర్‌తో నేను కలిసి ఆడాను. అతను ఎలాంటి మనస్తత్వంతో వస్తాడో తెలుసు. అతని కెరీర్ ప్రారంభంలోనే ఈ సిరీస్ విజయం మంచి ఆరంభం.
రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఫలితం రాబట్టడంపైనే బాగా ఆలోచించాం. నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేయాలనుకున్నాం. మేం వారు చేసే పరుగులను ఏ మాత్రం చూడలేదు. ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తున్నామనేదానికే ప్రాధాన్యత ఇచ్చాం. వారిని త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌లో రాణించాలనుకున్నాం.
పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. అయినా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. బ్యాటర్లు రిస్క్ తీసుకొని ఆడారు. 100-150 పరుగులకే ఆలౌటైనా సరే అనే రీతిలో దూకుడుగా ఆడాం. విజయం కావాలంటే రిస్క్ తీసుకోక తప్పదని భావించాం. ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనికి చాలా దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.
మా అంచనాలకు తగ్గట్లు అతను రాణించాడు. ఏ మాత్రం అలిసిపోకుండా సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అవకాశం ఇస్తే చెలరేగే బౌలర్లను సిద్దం చేయాలనుకుంటున్నాం. బెంచ్ బలాన్ని పెంచాలనుకుంటున్నాం. కిక్కిరిసిన షెడ్యూల్ నేపథ్యంలో ఆటగాళ్లు గాయపడే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలోనే వారిని రిప్లేస్ చేసే సత్తా కలిగిన ఆటగాళ్లను సిద్దం చేస్తున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 98 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), శుభ్‌మన్ గిల్(6) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 51)హాఫ్ సెంచరీతో రాణించాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ ఔటవ్వగా.. రిషభ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ(25 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.