ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగే భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకంటూ వచ్చిన విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. అసలు జట్టులో ఉన్నది ఇద్దరు స్పిన్నర్లు మాత్రమేనని, మరో ముగ్గురు ఆల్‌రౌండర్లని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ డెప్త్ కోసమే వారిని ఎంపిక చేశామని, ఆరుగురు పేసర్లను తీసుకున్న జట్లను ఎందుకు ఇలా విమర్శించరని అసహనం వ్యక్తం చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడికి చేరిన టీమిండియా గత ఐదు రోజులుగా ముమ్మరంగా సాధన చేస్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. టీమ్ ఎంపికపై వచ్చిన విమర్శలపై స్పందించాడు. తమ బలాలకు అనుగుణంగానే జట్టును ఎంపిక చేసినట్లు స్పష్టం చేశాడు.

ఐదుగురు కాదు.. ఇద్దరే..
'జట్టులో ఉన్నది ఇద్దరు స్పిన్నర్లు. మరో ముగ్గురు ఆల్‌రౌండర్లు. వారిని నేను ఐదుగురు స్పిన్నర్లుగా చూడటం లేదు. ముగ్గురు ఆల్‌రౌండర్లు బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తారు. మిగతా జట్లు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాయి. కానీ మీరు వారిని ఆరుగురు పేసర్లతో ఎందుకు ఆడుతున్నారని అడగడం లేదు. మేం మా బలాలపై మాత్రమే ఫోకస్ పెట్టాం. అందుకు తగ్గట్లుగానే జట్టును నిర్మించాం. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు విభిన్నమైన డైమెన్షన్ అందిస్తారు. వారితో మా బ్యాటింగ్ డెప్త్ పెరుగుతోంది. అందుకే మేం బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆగాళ్లను ఎంచుకున్నాం.'అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
టైటిల్ గెలవడమే మా లక్ష్యం..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని రోహిత్ శర్మ తెలిపాడు. 'దాదాపు 8 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ప్రతీ ఐసీసీ టోర్నీ మాకు ముఖ్యమైనదే. టైటిల్ గెలిచేందుకే ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం మా ఫోకస్ అంతా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే ఉంది. ఈ టోర్నీని విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. జట్టులోని ప్రతీ ఆటగాడికి వారి బాధ్యతలపై స్పష్టత ఉంది.
గతంలో భారత్ తరఫున ఎలా ఆడామో.. ఈ టోర్నీలోనూ అలానే ఆడుతాం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. గతంలో దుబాయ్ వేదికగా మేం చాలా క్రికెట్ ఆడాం. పిచ్ కండిషన్స్‌ను వీలైనంత త్వరగా అంచనా వేయడం కీలకం. పరిస్థితులను బట్టి ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.