టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 40కి పైగా సిక్సర్లు కొట్టిన సారథిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన రోహిత్ 11 బంతుల్లో 23 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఇందులో ఒక ఫోర్‌తో పాటు మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. దాంతో ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 41 సిక్స్‌లు బాదాడు. సారథిగా 40కిపైగా మూడు క్యాలండెర్ ఇయర్స్‌లో సిక్సర్లు బాదాడు. 2022లో 45 సిక్స్‌లు బాదిన రోహిత్.. 2023లో 80 సిక్స్‌లు కొట్టాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం కన్నేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. అటాకింగ్ గేమ్‌తో టీమిండియా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్‌తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్‌ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్‌పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్, షాద్మాన్ ఇస్లామ్ (7) ఉన్నారు. బంగ్లా ఇంకా 26 పరుగుల వెనుకంజలో ఉంది. చివరి రోజు ఆటలో భారత్ ఒక్క సెషన్ బ్యాటింగ్ చేసినా విజయం దాదాపు ఖాయమైనట్లే.