
మిర్పూర్: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(104 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93), మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) మరోసారి సెంచరీ చేజార్చుకున్నారు. దాంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 86.3 ఓవర్లలో 314 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు 87 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.
19/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. తైజుల్ ఇస్లామ్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(10),శుభ్‌మన్ గిల్(24)లను పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరూ ఎల్బీగా వెనుదిరగడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో పుజారా(24) క్యాచ్ ఔటవ్వగా.. విరాట్ కోహ్లీ(24)ని టస్కిన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు.
49 బంతుల్లోనే రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 60 బంతుల్లో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో టీమిండియా 226/4 స్కోర్ వద్ద టీ బ్రేక్‌కు వెళ్లింది. చివరి సెషన్‌లో సెంచరీలు చేస్తారనుకున్న పంత్, అయ్యర్ 10 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని మెహ్‌దీ హసన్ విడదీసాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 159 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే శ్రేయస్ అయ్యర్‌ను షకీబ్ అల్ హసన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
ఈ ఇద్దరీ వికెట్ల అనంతరం టీమిండియా ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. అక్షర్ పటేల్(4), రవిచంద్రన్ అశ్విన్(11), ఉమేశ్ యాదవ్(14), మహమ్మద్ సిరాజ్(7) క్రీజులో నిలవలేకపోయారు. ఉనాద్కత్(14 నాటౌట్) ఒక్కడే అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ నాలుగేసి వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్, మెహ్‌దీ హసన్ తలో వికెట్ తీసారు.