
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్(4/25), రవిచంద్రన్ అశ్విన్(4/71) నాలుగేసి వికెట్లతో చెలరేగారు. దాంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్లలో 227 పరుగులకు కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మోమినల్ హక్(15 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 84) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జయదేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఉనాద్కత్ గట్టి షాకిచ్చాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ జాకీర్ హసన్(15) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సెన్ షాంటో(24) ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన మోమినల్ హక్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. దాంతో బంగ్లాదేశ్ 82/2 స్కోర్ వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
లంచ్ బ్రేక్ అనంతరం ఉమేశ్ యాదవ్ వేసిన తొలి బంతికే షకీబ్ అల్ హసన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్(26)తో మోమినల్ హక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 78 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఉనాద్కత్ విడదీసాడు. కీపర్ క్యాచ్‌గా రహీమ్‌ను పెవిలియన్ చేర్చాడు.
అనంతరం లిటన్ దాస్(25) కూడా క్రీజులోకుదురుకునే ప్రయత్నం చేయగా.. అశ్విన్ దెబ్బతీసాడు. ఆ తర్వాత వచ్చిన మెహ్‌దీ హసన్(15), నురుల్ హసన్(6) వరుస విరామాల్లో వెనుదిరిగారు. దాంతో బంగ్లాదేశ్ 221/7తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆ వెంటనే టస్కిన్ అహ్మద్(1) వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. క్రీజులో పాతుకుపోయిన మోమినల్ హక్‌తో పాటు టెయిలండర్ ఖలెద్ అహ్మద్(0)లను అశ్విన్ ఔట్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది.