
ఢాకా: టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ టీమ్‌లోకి వచ్చిన ఈ సౌరాష్ట్ర ప్లేయర్.. ఎట్టకేలకు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనతో చివరి నిమిషంలో బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన జయదేవ్ ఉనాద్కత్.. తొలి టెస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక పేస్‌కు అనుకూలించే ఢాకా టెస్ట్‌లో జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ ఆరంభంలోనే బంగ్లాదేశ్ ఓపెనర్ జాకీర్ హసన్(15) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఉనాద్కత్‌కు కెరీర్‌లో ఇదే తొలి టెస్ట్ వికెట్ కావడం గమనార్హం.
అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం 2010లో సౌతాఫ్రికాతో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉనాద్కత్.. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చాడు.దాంతో సుదీర్ఘ కాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రిఎంట్రీ ఇచ్చిన భారత తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు ఈ ఘనత మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ పేరు మీద ఉండగా.. ఉనాద్కత్ అధిగమించాడు. పార్దీవ్ పటేల్ 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి కమ్ బ్యాక్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరమవడంతోనే ఉనాద్కత్‌కు అవకాశం దక్కింది.

ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసిన ఉనాద్కత్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన అద్భుత ప్రదర్శనతో కెప్టెన్‌గా సౌరాష్ట్రను విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్‌గా నిలబెట్టాడు. 2019-20 రంజీ ట్రోఫీలో 67 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 353 వికెట్లు తీసాడు. ఈ అసాధారణ ప్రదర్శనతోనే మళ్లీ భారత జట్టులోకి రాగలిగాడు. ఇక ఉనాద్కత్ కోసం గత మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్ యాదవ్‌ను పక్కన కూర్చోబెట్టారు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు పేసర్లకు అడ్వాంటేజ్‌గా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఉనాద్కత్ నిలబెట్టుకుంటున్నాడు. తొలి స్పెల్‌లోనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(23 బ్యాటింగ్), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(16 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో ఉనాద్కత్ ఓ వికెట్ తీయగా.. అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.