సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతనికి బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవ్వనుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం భారత్‌కు చాలా కీలకం. గాయంతో భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీతో ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతను మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే ఓ జాతీయ చానెల్ వివరాల ప్రకారం ఈ సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తు టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలోనే టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటుందంట. అయితే బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనే విషయంపై సెలెక్టర్లు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఆస్ట్రేలియా గడ్డపైనే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఆడనుంది.
నవంబర్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం సొంతగడ్డపైనే న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఉన్న కీలక టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలోనే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరాలంటే ఈ రెండు సిరీస్‌లో భారత్ విజయం సాధించడం చాలా కీలకం.
జస్‌ప్రీత్ బుమ్రా చివరి సారిగా టీ20 ప్రపంచకప్ 2024 ఆడాడు. ఆ తర్వాత విశ్రాంతి పేరిట అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉంచాలనుకుంటున్నారు. టెస్ట్‌ల్లోనూ బుమ్రాకు మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 20.69 సగటుతో 159 వికెట్లు తీసాడు. అత్యుత్తమ ప్రదర్శన 6/27 కాగా.. 10 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో ఆడాడు.
మరోవైపు మహమ్మద్ షమీ.. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం జట్టుకు దూరమయ్యాడు. మెగా టోర్నీలో 24 వికెట్లతో సత్తా చాటిన షమీ.. తీవ్ర గాయంతో జట్టుకు దూరమయ్యాడు. నొప్పితోనే అతను ప్రపంచకప్‌లో బౌలింగ్ చేశాడు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు బీసీసీఐ... చెన్నై వేదికగా ఓ ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించాలనుకుంటుంది. అంతకుముందు సీనియర్ బ్యాటర్లంతా దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించింది. డబ్ల్యూటీసీ ప్రారంభించినప్పటి భారత్ వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయింది. మొదటిసారి విరాట్ కోహ్లీ సారథ్యంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్.. రెండో సారి రోహిత్ శర్మ సారథ్యంలో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది.