IND vs BAN: శతకాలతో చితక్కొట్టిన ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం!

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో నామమాత్రపు చివరి వన్డేలో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210) విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 113) శతక్కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హోస్సెన్ రెండేసి వికెట్లు తీయగా..మెహ్‌దీ హసన్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీసారు.

దంచి కొట్టిన ఇషాన్..
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వరుసగా మూడో వన్డేలోనూ శిఖర్ ధావన్(3) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే మెహ్‌దీ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఎబాదత్ హోస్సెన్, మెహ్‌దీ హసన్, షకీబ్ అల్ హసన్‌లను చెడుగుడు ఆడాడు.
49 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్.. మరో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత వేగంగా ఆడిన ఇషాన్ కిషన్ మరో 18 బంతుల్లోనే 150 పరుగుల మార్క్ ధాటాడు. అదే జోరులో మరో 23 బంతుల్లోనే ద్విశతకం నమోదు చేసి అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

కోహ్లీతో భారీ భాగస్వామ్యం..
ముస్తాఫిజుర్ వేసిన 35 ఓవర్ చివరి బంతికి క్విక్ సింగిల్ తీసి ఇషాన్ ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన నాలుగో భారత బ్యాటర్‌గా అత్యంత పిన్నవయస్కుడిగా కూడా రికార్డులు నమోదు చేశాడు. మరో ఎండ్‌లో విరాట్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇషాన్ కిషన్ జోరుకు టస్కిన్ అహ్మద్ బ్రేక్ వేయడంతో రెండో వికెట్‌కు నమోదైన 290 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

శతక్కొట్టిన కోహ్లీ..
క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(3) విఫలమవ్వగా.. కేఎల్ రాహుల్ సాయంతో విరాట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద ఎబాదత్ హోస్సెన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. 72వ శతకంతో రికీపాంటింగ్(71)ను అధిగమించాడు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్(8), కోహ్లీ బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. దాంతో భారత స్కోర్ బోర్డు వేగం తగ్గింది. చివర్లో సుందర్(37), అక్షర్ పటేట్(20) ధాటిగా ఆడటంతో భారత్ 400 పరుగుల మార్క్‌ను ధాటింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 పరుగులు తక్కువగా చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications