బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేసి ఓటమిపాలైంది. టౌహిడ్ హృదయ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(25 బంతుల్లో 8 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.
గోల్డెన్ డక్‌తో..
298 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ పర్వేజ్ హోస్సేన్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ కాసేపటికే దూకుడు కనబర్చిన తంజిద్ హసన్(15)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(14)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి లిటన్ దాస్ రాగా.. పవర్ ప్లేలో బంగ్లాదేశ్ 3 వికెట్లకు 59 పరుగులు చేసింది.
టౌహిడ్ హృదయ్, లిటన్ దాస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీలుచిక్కిన బంతిని ఈ జోడీ బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అయ్యేందుకు ప్రయత్నించిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన లిటన్ దాస్(42)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
టౌహిడ్ హాఫ్ సెంచరీ..
ఆ కాసేపటికే మహ్మదుల్లా(8)ను మయాంక్ యాదవ్ ఔట్ చేయగా.. మెహ్‌దీ హసన్‌ను నితీష్ కుమార్ రెడ్డి, రిషద్ హోస్సేన్‌ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు టౌహిడ్ హృదయ్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.