
ఢాకా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకు కుప్పకూలింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) మినహా అంతా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్‌హసన్(5/36) ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా ఈబాడట్ హోస్సెన్(4/47) నాగులు వికెట్లతో సత్తా చాటాడు. మెహ్‌దీ హసన్‌కు ఓ వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(7)ను మెహ్‌దీ హసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే అనంతరం షకీబ్ అల్ హసన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
అతను వేసిన 11వ ఓవర్‌లో నిలకడగా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(27), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)లు బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ముందుగా షకీబ్ వేసిన అద్భుత బంతికి రోహీత్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. తర్వాత లిటన్ దాస్ కళ్లు చెదిరే క్యాచ్‌కు విరాట్ పెవిలియన్ బాట పట్టాడు. షకీబ్ వేసిన మూడో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా భావించి రోహిత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త టర్న్ తీసుకొని రోహిత్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని వికెట్లను గీరాటేసింది. షకీబ్ వేసిన నాలుగో బంతిని విరాట్ కవర్ డ్రైవ్ షాట్ ఆడగా.. లిటన్ దాస్ ఫుల్ లెంగ్త్ డైవ్‌తో ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అతని అసాధారణ ఫీల్డింగ్‌కు విరాట్ బిత్తరపోయాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(24) కూడా ఔటవ్వడంతో 92 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్(19)తో కలిసి రాహుల్ కీలక భాగస్వామ్యం అందించాడు. ఈ క్రమంలో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ కూడా క్రీజులో సెట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ గాడిన పడినట్లే అనుకున్నారంతా. అయితే షకీబ్ అల్ హసన్ మరోసారి సుందర్‌ను క్యాచ్ ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత 4 పరుగుల వ్యవధిలోనే షెహ్‌బాజ్(0), శార్దూల్ ఠాకూర్(2), దీపక్ చాహర్(0) ఔటయ్యారు. క్రీజులోకి వచ్చిన సిరాజ్‌తో రాహుల్ పోరాడాడు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను క్యాచ్ ఔటవ్వడం.. చివరి వికెట్‌గా సిరాజ్ వెనుదిరగడంతో భారత్ కుప్పకూలింది.