రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే గెలిచిన టీమిండియా చివరి మ్యాచ్‌కు సిద్దమైంది. రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగే చివరి వన్డేలో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం జట్టులో 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
అస్వస్థత కొందరు.. వ్యక్తిగత కారణాలతో మరికొందరు.. ఆసియా గేమ్స్ కోసం ఇంకొందరు ఆటగాళ్లు జట్టును వీడారు. నెట్ బౌలర్స్ కూడా అందుబాటులో లేరు. దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ లోకల్ ప్లేయర్లను పిలిపించి ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్ సమయంలో అవసరమైతే వారిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా కూడా వాడుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 13 మంది ఆటగాళ్లలో ఇద్దరూ మాత్రమే అదనంగా ఉండనున్నారు.

ఇద్దరికి మించి ఆటగాళ్లు గాయపడితే సహాయక సిబ్బంది లేదా లోకల్ ప్లేయర్లతో ఫీల్డింగ్ చేయించాల్సిన పరిస్థితి టీమిండియాకు రానుంది. ఈ క్రమంలోనే లోకల్ ప్లేయర్లను బ్యాకప్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానికంగా ఉంటూ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని మంగళవారం మీడియా సమావేశం వెల్లడించాడు. 'మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మూడో వన్డేకు అందుబాటులో లేకుండా పోయారు. కొందరు అస్వస్థతకు గురైతే.. మరికొందరు వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లారు. ఇంకొందరికి రెస్ట్ ఇచ్చారు.
దాంతో 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ మూడో వన్డే ఆడటం లేదు. అక్షర్ పటేల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. 13 మంది ఆటగాళ్లతోనే చివరి వన్డే ఆడాల్సి ఉంది. జట్టులో చాలా అనిశ్చితి నెలకొంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
మూడో వన్డేకు అందుబాటులో ఉన్న భారత్ ఆటగాళ్లు:
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్.