ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం అర్థరాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నివాళిగా ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే టీమిండియా రెండు ప్రపంచకప్‌తో పాటు ఓ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మన్మోహన్ సింగ్ తప్పుకున్న తర్వాత భారత్ 11 ఏళ్ల పాటు ఐసీసీ టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2024ను గెలుచుకొని ఈ నిరీక్షణకు తెరదించింది. ప్రస్తుతం మైదానంలో ఉన్న ఆటగాళ్లు.. మన్మోహన్ సింగ్ మృతిపై ఇంకా స్పందించలేదు. మరోవైపు భారత మాజీ క్రికెటర్లు మాత్రం మన్మోహన్ సింగ్‌కు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్‌కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు. మహమ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 5.30 ఎకానమీతో 122 పరుగులిచ్చుకున్నాడు. అతని కెరీర్‌లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్. సిరాజ్ వైఫల్యం ఆసీస్‌కు కలిసిరాగా.. టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది.