ఇండోర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. 400 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 9 ఓవర్లలో 2 వికెట్లకు 56 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(26 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(17 బ్యాటింగ్) ఉన్నారు. వరుస బంతుల్లో మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్‌లను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.
ఇక భారత ఇన్నింగ్స్ సందర్భంగా అంతరాయం కలిగించిన వర్షం.. మళ్లీ ఆసీస్ బ్యాటింగ్‌కు అడ్డుకుంది. ప్రస్తుతం వర్షం ఆగిపోగా.. గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్దం చేస్తున్నారు. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చిత్తడిగా ఉందని వెళ్లిపోయారు. ఈ మ్యాచ్ కటాఫ్ టైమ్‌ను 9.28 గంటలుగా నిర్ణయించారు.

ఆ సమయానికి మ్యాచ్ ప్రారంభమైతే డక్ వర్త్ లూయిస్ ప్రకారం 20 ఓవర్ల ఆటను ఆడించి విజేతను నిర్ణయిస్తారు. డీఎల్ఎస్ లెక్కల ప్రకారం 20 ఓవర్లలో ఆసీస్ లక్ష్యం 230. ఇప్పటికే 9 ఓవర్లలో 56 పరుగులు చేసిన ఆ జట్టు మిగతా 11 ఓవర్లలో 174 రన్స్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందే మ్యాచ్ ప్రారంభమై 40 ఓవర్ల ఆట సాధ్యమైతే ఆసీస్ 354 పరుగులు చేయాల్సి ఉంటుంది. 35 ఓవర్లకు కుదిస్తే 328 రన్స్ చేయాలి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.