ఇండోర్: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తనదైన శైలిలో ఆడుతూ.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన తన సహచర ఆటగాడు కామెరూన్ గ్రీన్‌పై సూరీడు విరుచుకుపడ్డాడు. వరుసగా 4 బంతుల్లో 4 సిక్స్‌లు బాదాడు.
6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదుతాడా? అనే సందేహాన్ని కలిగించాడు. చివరకు గ్రీన్ చాకచక్యంగా బౌలింగ్ చేసి పరువు కాపాడుకున్నాడు. సూరీడు విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వేయగా.. సూర్య పికప్ షాట్‌తో బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్ కొట్టాడు.

రెండో బంతిని కూడా లెగ్ సైడ్ వేయగా ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ తరలించాడు. మూడో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా తరలించి హ్యాట్రిక్ సిక్సర్ నమోదు చేశాడు. నాలుగో బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేయగా .. డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ రాబట్టిన సూర్య.. బౌలర్ వెన్నులో వణుకు పుట్టించాడు.
ఎలా వేస్తున్నా సిక్స్‌లు బాదుతుండటంతో గ్రీన్.. ఐదో బంతిని వైడ్ ఔట్ సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసి సూర్య సిక్సర్‌ను అడ్డుకున్నాడు. అప్పటికీ సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఉన్నా సూర్య.. సాధ్యం కాదని గ్రహించి సింగిల్ తీసాడు. దాంతో ఆసీస్ ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనదైన రోజున ఎంతటి ప్రమాదకర ఆటగాడినో అనే విషయాన్ని సూర్య మరోసారి తెలియజేశాడు.
వన్డేల్లో వరుసగా 4 బంతుల్లో 4 సిక్స్‌లు బాదిన మూడో భారత ఆటగాడిగా సూర్య (Suryakumar Yadav) చరిత్రకెక్కాడు. అతని కన్నా ముందు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు.
సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.