
అంపైర్ తప్పుడు నిర్ణయానికి..
ఆసీస్ యువ బౌలర్ మాథ్యూ కుహ్నెమన్ వేసిన బంతిని ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేసిన వెంటనే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఔటిచ్చాడు. ఇక బంతి బ్యాట్‌కు తాకిందనే నమ్మకంతో విరాట్ రివ్యూ కోరాడు. కానీ రిప్లేలో బంతి, ప్యాడ్ ఒకేసారి తాకినట్లు కనిపించింది. అయితే బ్యాట్‌ను ముందుగా తాకినట్లు తనకు స్పష్టమైన ఆధారం లేదని, ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఔటిస్తున్నాని థర్డ్ అంపైర్ ప్రకటించాడు.
అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి.. బ్యాట్, ప్యాడ్ ఒకేసారి తాకినప్పుడు బ్యాటర్‌కు ఫేవర్‌గా నిర్ణయం తీసుకోవాలి. అయితే విరాట్ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను ఈ తరహాలోనే పెవిలియన్ చేరాడు.
నితిన్ మీనన్ నిలదీసిన కోహ్లీ..
ఈ నిర్ణయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సైతం అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇక మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావించిన విరాట్ కోహ్లీ అంపైర్ కారణంగా వెనుదిరగడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డ్‌లోకి వచ్చిన విరాట్.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తో ఈ వికెట్ గురించి చర్చించాడు. అతను దూరంగా వెళ్తున్నా వెంటాడి వేధించాడు. ఔట్ ఎట్లిచ్చనవ్ అంటూ నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ఓ అభిమాని తన మొబైల్‌లో చిత్రకరించగా.. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కష్టాల్లో ఆస్ట్రేలియా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా.. టీమిండియా 262 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా గట్టెక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అశ్విన్, జడేజా ధాటికి 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(45), మార్నస్ లబుషేన్(35) రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖవాజా(6), స్టీవ్ స్మిత్(9), మాథ్యూ రేన్‌షా(2), పీటర్ హ్యాండ్‌స్కోంబ్(0), ప్యాట్ కమిన్స్(0) దారుణంగా విఫలమయ్యారు.

సంక్షిప్త స్కోర్లు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 95/7


Click it and Unblock the Notifications












