ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమెరుగని జట్టుగా రోహిత్ సేన ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోసారి విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లతో 45), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తీయగా.. బెన్, కూపర్ తలో వికెట్ పడగొట్టారు.

శుభారంభం లేదు..
లక్ష్యచేధనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(8)మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ.. రెండు లైఫ్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కూపర్ కొన్నోల్లీ.. రోహిత్ శర్మ(28)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్, కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 55 పరుగులు చేసింది.
ఆదుకున్న కోహ్లీ-అయ్యర్..
అనంతరం ఇదే జోరు కనబర్చిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అయ్యర్ అనవసర షాట్‌తో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కోహ్లీ తనదైన స్టైల్‌లో పరుగులు చేయగా.. అక్షర్ పటేల్‌లో భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని నాథన్ ఎలిస్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 4వ వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హార్దిక్ పాండ్యా విధ్వంసం..
బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్‌తో కోహ్లీ ఆచితూచి ఆడాడు. ఇద్దరూ నెమ్మదిగా ఆడటంతో 39 బంతుల వరకు బౌండరీ రాలేదు. ఆ తర్వాత రాహుల్ అద్భుతమైన షాట్లతో చెలరేగి ఒత్తిడిని తగ్గించాడు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో 3 భారీ సిక్స్‌లు బాది టీమిండియాపై ఒత్తిడి తగ్గించాడు. విజయం ముంగిట హార్దిక్ పాండ్యా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. జడేజా సాయంతో కేఎల్ రాహుల్ భారీ సిక్సర్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.