ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. డే/నైట్ టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఈ ఫీట్ సాధించాడు.
ఈ క్రమంలో తన పేరిట ఉన్న రికార్డ్‌ను తనే తిరిగ రాసాడు. 2022లో ఇంగ్లండ్‌తో హోబర్ట్ వేదికగా జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో 112 బంతుల్లో శతకం సాధించాడు. పింక్ బాల్ టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా శతకం బాదిన టాప్-3 బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 125 బంతుల్లో ట్రావిస్ హెడ్ శతకం సాధించాడు.

పింక్ బాల్ టెస్ట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆసీస్ బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డ్ సాధించాడు. ఈ జాబితాలో మార్నస్ లబుషేన్ 4 శతకాలతో టాప్‌లో ఉండగా.. ట్రావిస్ హెడ్ మూడు సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ట్రావిస్ హెడ్‌కు ఇది 8వ శతకం.
ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140) విధ్వంసకర శతకంతో ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆసీస్ ఇప్పటికే 147 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ట్రావిస్ హెడ్‌తో పాటు మార్నస్ లబుషేన్(126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ప్యాట్ కమిన్స్(8 బ్యాటింగ్), మిచెల్ స్టార్క్(17 బ్యాటింగ్) ఉన్నారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) దూకుడుగా ఆడగా.. కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.