
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వైఫల్యం కొనసాగుతోంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోనూ స్మిత్ తడబడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో రెండు కీలక క్యాచ్‌ల నేలపాలు చేసిన స్టీవ్ స్మిత్.. రెండో టెస్ట్‌లో అక్షర్ పటేల్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను వదిలేసి ఆసీస్ కొంపముంచాడు. ఈ అవకాశాన్ని అందుకున్న అక్షర్ పటేల్.. హాఫ్ సెంచరీతో భారత్‌ను పటిష్ట స్థితిలో నిలబెట్టాడు.
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్(115 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 74) ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన భారత ఇన్నింగ్స్‌కు అసాధారణ బ్యాటింగ్‌తో ఊపిరి అందించాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(71 బంతుల్లో 5 ఫోర్లతో 37)తో కలిసి 8వ వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ సిరీస్‌లోనే టీమిండియాకు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది.
ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా కనీసం 200 పరగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ అక్షర్ అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాను గట్టెక్కించాడు. అయితే లయన్ వేసిన 64వ ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న స్మిత్ నేలపాలు చేశాడు. అప్పుడు అక్షర్ పటేల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే టీమిండియా ఇన్నింగ్స్ 220లోపే ముగిసేది. ఆ కొద్దిసేపటికే లయన్ వేసిన 70వ ఓవర్‌లో అశ్విన్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో మ్యాట్ రేన్ షా నేలపాలు చేశాడు. అప్పుడు అశ్విన్ స్కోర్ 20. ఈ అవకాశాలతో చెలరేగిన ఈ ఇద్దరూ భారీ భాగస్వామ్యంతో జట్టును పోటీలో నిలబెట్టారు.
ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(6) ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో షార్ట్ లెగ్ ఫీల్డర్ అయ్యర్‌కు సునాయస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.