టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో 24 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో మంధాన 50 బంతుల్లో శతకం పూర్తి చేసుకుంది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే హిట్టింగ్ మొదలుపెట్టిన మంధాన 23 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకుంది. తద్వారా ఫాస్టెస్ట్ ఫీఫ్టీ రికార్డ్ కూడా తన పేరిట లిఖించుకుంది. అనంతరం అదే జోరు కొనసాగించిన మంధాన.. 14 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది.
దాంతో ఆస్ట్రేలియా బ్యాటర్ కారెన్ రోల్టన్, బెత్ మూనీ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులను మంధాన అధిగమించింది. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా 57 బంతుల్లో శతకం సాధించగా.. మంధాన 50 బంతుల్లోనే సెంచరీ బాది వారిని అధిగమించింది. ఆస్ట్రేలియాకే చెందిన మెగ్ లాన్నింగ్ పేరిట ఫాస్టెస్ సెంచరీ రికార్డ్ ఉంది. 2013లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెగ్ లాన్నింగ్ 45 బంతుల్లో సెంచరీ బాది అగ్రస్థానంలో కొనసాగుతోంది.

63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 125 పరుగులు చేసిన స్మృతి మంధాన.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. హర్మన్‌ప్రీత్‌తో కలిసి మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించింది. ఈ సిరీస్‌లో మంధానకు ఇది రెండో శతకం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మంధాన 58, 117, 125 పరుగులతో రాణించింది. వన్డే ప్రపంచకప్ 2025 ముందు మంధాన సూపర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 412 పరుగుల భారీ స్కోర్‌కు ఆలౌటైంది. బెత్ మూనీ(75 బంతుల్లో 23 ఫోర్లు, సిక్స్‌తో 138) విధ్వంసకర శతకంతో రాణించగా.. జార్జియో వోల్(81), ఎల్లిస్ పెర్రీ(68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుంధతి రెడ్డి(3/8) మూడు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్(2/79), దీప్తి శర్మ(2/75) రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, స్నేహ్ రానా చెరో వికెట్ తీసారు.
అనంతరం భారత మహిళల జట్టు 289 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయం కోసం పోరాడుతోంది. క్రీజులో దీప్తి శర్మ(71 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతుండగా.. ఆమెకు స్నేహ్ రాణా(20 బ్యాటింగ్) అండగా నిలిచింది. స్మృతి మంధాన విధ్వంసకర శతకానికి తోడుగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(52) హాఫ్ సెంచరీతో రాణించింది.