ప్రత్యర్థి బౌలర్ ఎవరా? అనేది తమ జనరేషన్ బ్యాటర్లకు అనవసరమని, బంతిని చూసి బాదడమే తమకు తెలుసని టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.
దాంతో గబ్బా టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ ప్రిపరేషన్స్‌ను టీమిండియా పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ పాల్గొన్నాడు. తమ ప్రిపరేషన్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తాము తాజాగా ప్రారంభిస్తామని, మూడు టెస్ట్‌ల సిరీస్‌గా భావించి ఆడుతామని చెప్పాడు. 'ఒక్కసారి కూడా గెలవకపోతే బాధపడాలి. కానీ గత పర్యటనలో మేం ఇక్కడ విజయం సాధించాం. భారత గడ్డపై అదే జోరు కొనసాగించాం. ప్రత్యర్థి బౌలర్ ఎవరా? అనేది ఈ జనరేషన్‌కు అనవసరం. బంతిని చూసి ఆడటమే తెలుసు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ అంతా బాగుంది. జట్టంతా కలిసి డిన్నర్ చేశాం. ఎంతో సరదాగా గడిపాం. అడిలైడ్‌లో మేం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే ఈ పరాజయంతో ఆందోళన పడటం లేదు. ఇక నుంచి మూడు టెస్ట్‌ల సిరీస్‌గా భావించి ఆడుతాం.
గబ్బా టెస్ట్‌లో గెలిస్తే.. మెల్‌బోర్న్, సిడ్నీలోనూ పైచేయి సాధిస్తాం. గత సిరీస్‌లోనూ అడిలైడ్‌లో మాకు ఓ పరాజయం ఎదురైంది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్నాం. ఇప్పుడూ కూడా అదే సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం. గబ్బాలో మాకు మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడికి రాగానే మైదానం మొత్తం తిరిగాం. ఇక్కడ మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పిచ్ కూడా బాగుంటుంది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు టీమిండియా తరఫున శుభ్‌మన్ గిల్ అభినందనలు తెలిపాడు. అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గెలవడం దేశానికే గర్వకారణమని కొనియాడాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. ఆ జోరును మాత్రం కొనసాగించలేకపోయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్‌లో మాత్రం 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.