భారత తుది జట్టు నుంచి యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తప్పించాలని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. బంతితో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్న నితీష్ కుమార్ రెడ్డిని కేవలం బ్యాటర్‌గా కొనసాగించడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహరమని అభిప్రాయపడ్డాడు.
నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో ఆడించడం ద్వారా బౌలింగ్ అటాక్ బలహీనమవుతుందని చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో టెస్ట్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగులు భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.

ఈ రెండు మ్యాచ్‌ల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో దుమ్మురేపాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42 పరుగులతో రాణించాడు. కానీ బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వైఫల్యం జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లపై అదనపు ఒత్తిడిని తీసుకొస్తోంది.
ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డిని తప్పించి ఎక్స్‌ట్రా బౌలర్ లేదా బౌలింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటర్‌ను తీసుకోవాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. 'నితీష్ కుమార్ రెడ్డిలో అసాధారణమైన బ్యాటింగ్ ప్రతిభ ఉంది. అతని ఆటను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. నాణ్యమైన బౌలింగ్‌ను నితీష్ ఎదుర్కొన్న తీరు చూస్తేనే అతని బ్యాటింగ్ నైపుణ్యం అర్థమవుతోంది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా నితీష్ కుమార్ రెడ్డికి పెద్దగా పరుగులు లేవు. కానీ అతనిలో అరుదైన బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. టీమిండియా తుది జట్టు కాంబినేషన్‌పై ఆలోచన చేయాలి. బ్యాటింగ్ సమస్యలను పరిష్కరిస్తూనే బౌలింగ్ బలాన్ని పెంచుకోవాలి. నితీష్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా.. బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. అతన్ని కేవలం బ్యాటింగ్ కోసమే జట్టులో కొనసాగించడం రిస్కీనే.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో కాస్తో కూస్తో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ రెడ్డి తప్పించడం ఏంటని మండిపడుతున్నారు. కావాలంటే పేలవ ఫామ్‌తో తడబడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను తుది జట్టులో నుంచి తప్పించాలని సూచిస్తున్నారు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.