ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. వ్యక్తిగత పనులతో ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రెండో సారి తండ్రైన రోహిత్ శర్మ.. కుటుంబ సభ్యులతో గడిపేందుకు పెర్త్ టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు.
తన సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతను రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది. కానీ తొలి టెస్ట్ జరుగుతుండగానే జట్టుతో కలుస్తానని రోహిత్ బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

పింక్ బాల్ టెస్ట్‌కు ముందు జరిగే వామప్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. 'రోహిత్ శర్మ నవంబర్ 23న ముంబై నుంచి ఆస్ట్రేలియాకు బయల్దేరాల్సి ఉంది. అతను 24న తొలి టెస్ట్ వేదికైన పెర్త్ చేరుకుంటాడు. తర్వాత అడిలైడ్ వేదికగా జరిగే డేనైట్ టెస్ట్‌కు సంబంధించిన సన్నాహకాల గురించి టీమిండియా కోచింగ్ స్టాఫ్‌తో చర్చిస్తాడు. కాన్‌బెర్రాలో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు.'అని సదరు అధికారి వెల్లడించాడు.
శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. తొలి టెస్ట్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా దేశవాళీ టీమ్ ప్రైమినిస్టర్స్ ఎలెవన్‌తో భారత జట్టు తలపడనుంది. రెండు రోజుల పాటు జరిగే వామప్ మ్యాచ్ నవంబర్ 30న ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య పింక్ బాల్ టెస్ట్ జరగనుంది.