
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ తీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. టర్నింగ్ ట్రాక్‌పై మరోసారి భారత బ్యాటర్లంతా విఫలమవ్వగా.. చతేశ్వర్ పుజారా(142 బంతుల్లో 5 ఫోర్లు సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా.. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి పుజారా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
ఇక ఆసీస్ స్పిన్నర్ల ధాటికి పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడి పరుగులు రాబట్టలేకపోయింది. మర్ఫీ వేసిన 54 ఓవర్ మెయిడిన్ అవ్వడంతో తీవ్ర చికాకుకు గురైన రోహిత్.. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్‌తో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'ఏంది రా ఈ టుక్కు టుక్కు.. మంచి షాట్ బాల్స్ వేస్తుంటే దంచి కొట్టకుండా డిఫెండ్స్ చేస్తున్నారు. పోయి భారీ షాట్స్ ఆడమనుపో'అని ఓవర్ మధ్యలో ఇషాన్‌ను క్రీజులోకి పంపించాడు.
ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే సందేశాన్నిచ్చాడు. రోహిత్ అసహనానికి గురవుతున్నాడనో... లేక ఎదురుదాడికి దిగాలనో తెలియదు కానీ.. పుజారా తన శైలికి భిన్నంగా ఓవర్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. దాంతో రోహిత్ సంతోషంతో ఎగిరి గంతేసాడు. అయితే ఆ మరుసటి ఓవర్‌లోనే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.
లయన్ బౌలింగ్‌లో పుజారా ఆడిన బంతిని లెగ్ స్లిప్‌లో స్మిత్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో పుజారా గ్రేట్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి సిరాజ్ రాగా.. అక్షర్ భారత్ ఆధిక్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.
156/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్(3/44), ఉమేశ్ యాదవ్(3/12) ధాటికి 197 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్‌కు 89 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ ముంగిట నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ(33 బంతుల్లో 12)తో పాటు శుభ్‌మన్ గిల్(5), విరాట్ కోహ్లీ(13), రవీంద్ర జడేజా(7), శ్రీకర్ భరత్(3), రవిచంద్రన్ అశ్విన్(16) దారుణంగా విఫలమయ్యారు. మధ్యలో శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.