టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో సూపర్-8 మ్యాచ్‌లో తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28)మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ(0) డక్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిషభ్ పంత్(15) ఔటైనా.. సూర్యతో కలిసి రోహిత్ చెలరేగాడు.
సూర్య సైతం తన బ్యాట్‌కు పని చెప్పడంతో 8.4 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన టీమిండియా 13.4 ఓవర్లలోనే 150 పరుగులు పూర్తి చేసుకుంది. సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను మిచెల్ స్టార్క్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కొద్దిసేపటికే సూర్య(31) కూడా ఔటవ్వడంతో టీమిండియా పరుగుల వేగం తగ్గింది. శివమ్ దూబే(28), హార్దిక్ పాండ్యా(27 నాటౌట్) జట్టు స్కోర్‌ను 200 ధాటించారు.