
చెన్నై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిపై కోపంతో ఊగిపోయాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై రోహిత్ శర్మ(Rohit Sharma) కన్నెర్ర చేశాడు. డీఆర్‌ఎస్ విషయంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చేసిన తప్పిదం.. రోహిత్ శర్మకు ఆగ్రహం తెప్పించింది. రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా కుల్దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన మూడో బంతికి డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ.. కుల్డీప్ వేసిన నాలుగో బంతిని ఆడలేకపోయాడు. బంతి బ్యాట్‌ను మిస్సై ప్యాడ్‌కు తాకడంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ మాత్రం ఔటివ్వలేదు. దాంతో రోహిత్ శర్మ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్లిప్ ఫీల్డర్ విరాట్ కోహ్లీతో కలిసి రివ్యూ తీసుకునే ప్రయత్నం చేయగా.. కుల్దీప్ యాదవ్ వద్దంటూ వెళ్లిపోయాడు. కనీసం వారితో మాట్లాడకుండానే వెనుదిరిగాడు. దాంతో కోహ్లీ, రోహిత్ కోపంతో ఊగిపోయారు. రిప్లేలో బంతి లెగ్‌స్టంప్‌ను తాకినట్లు అనిపించింది.
అనంతరం ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లోనూ కుల్దీప్ యాదవ్ తప్పిదం చేశాడు. ఈ ఓవర్‌లో వేసిన బంతి అష్టన్ అగర్ ప్యాడ్‌కు తగలగా.. భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం ఔటివ్వలేదు. వెంటనే కుల్దీప్ యాదవ్.. రోహిత్ శర్మ వద్దని చెబుతున్నా వినకుండా పట్టుబట్టి రివ్యూ తీసుకున్నాడు. తీరా రివ్యూలో నాటౌట్ అని తేలడంతో రోహిత్ ఆగ్రహానికి గురయ్యాడు. చెబితే విన్నావా? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.