
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం గండం నుంచి గట్టెక్కాడు. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్యాట్ కమిన్స్ వేసిన ఇన్‌స్వింగర్ డెలివరీ రోహిత్ శర్మ రహస్య ప్రదేశంలో బలంగా తాకింది. బంతిని అంచనా వేయడంలో రోహిత్ విఫలమయ్యాడు. దాంతో బంతి తాగలరాని చోట బలంగా తాకింది. దాంతో రోహిత్ నొప్పిని తట్టుకోలేకపోయాడు. కాస్త పక్కకు వెళ్లి కింద కూర్చున్నాడు. చాలా అసౌకర్యంగా కనిపించాడు.
ఈ అనూహ్య ఘటనతో అభిమానులు, టీవీ ముందున్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. పెద్ద గాయామా? అని భయపడ్డారు. కానీ రోహిత్ బ్యాటింగ్ కొనసాగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కమిన్స్ వేసిన ఈ ఓవర్ రెండో బంతినే బౌండరీకి తరలించిన రోహిత్.. స్టంప్ లైన్ మీదుగా వేసిన మూడో బంతిని అంచనా వేయలేకపోయాడు. బ్యాక్‌ఫుట్‌లో లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసాడు. కానీ వేగంగా దూసుకొచ్చిన ఇన్ స్వింగర్ రోహిత్ బ్యాట్ ఎత్తే లోపే లొపలికి దూసుకొచ్చి గాడ్‌ను బలంగా తాకింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ నొప్పి భరించడం చాలా కష్టమని, పగోడికి కూడా ఆ బాధ రావద్దని కొందరంటే.. రోహిత్ జాగ్రత్త అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖవాజా(125 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 81), పీటర్ హాండ్‌స్కోంబ్(142 బంతుల్లో 9 ఫోర్లతో 72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(4/60) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్(3/57), రవీంద్ర జడేజా(3/68) మూడేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(13 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(4 బ్యాటింగ్) ఉన్నారు.