ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్‌కు టీమిండియా ఓపెనర్ ఎవరా? అనే సందిగ్దతకు కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. కేఎల్ రాహులే ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు. మిడిలార్డర్‌లో తాను బ్యాటింగ్ చేస్తానని వెల్లడించాడు. ఈ నిర్ణయం తనకు కష్టమైనా.. జట్టుకు అదే బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.
ఆసీస్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో టెస్ట్‌కు సిద్దమైంది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న డే/నైట్ టెస్ట్‌లో ఆతిథ్య ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ పింక్ బాల్ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

నా కొడుకును ఎత్తుకొని చూశా..
రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా సత్తా చాటాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రోహిత్ రాకతో ఓపెనర్ ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. ఓపెనింగ్ స్లాట్‌పై క్లారిటీ ఇచ్చాడు.
'కేఎల్ రాహులే ఓపెనింగ్ చేస్తాడు. నేను మిడిలార్డర్‌లో ఏదొక స్థానంలో బ్యాటింగ్ చేస్తా. బ్యాటర్‌గా ఇది నాకు కష్టమే. కానీ జట్టుకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఎలాంటి నిర్ణయమైనా జట్టు విజయం కోసమే తీసుకుంటాం. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారు. నా కొడుకును ఎత్తుకొని మరి వారి బ్యాటింగ్ చూశాను. రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదనిపించింది. భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేం. పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయి.
కేఎల్ రాహుల్‌కు సూపర్ రికార్డ్..
ఓవర్‌సీస్‌లో కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డ్ ఉంది. జట్టులో కొనసాగేందుకు అతను పూర్తి అర్హుడు. తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. పెర్త్ వంటి వికెట్‌పై నిలకడగా ఆడటం సులువైన పనికాదు. టీమ్ కాంబినేషన్‌ను మార్చాల్సిన అవసరం లేదనిపించింది. కెప్టెన్‌గా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టు విజయానికి ఉపయోగపడాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తన సతీమణి రితికా సజ్దే ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు రోహిత్.. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. నవంబర్ 15న రోహిత్ శర్మకు రెండో సంతానంగా కొడుకు పుట్టాడు. అతనికి అహాన్ అని పేరు పెట్టారు.
శుక్రవారం మొదలయ్యే పింక్ బాల్ టెస్ట్‌లోనూ తొలి టెస్ట్ విజయ జోరును కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.