టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ వినూత్న షాట్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో పంత్.. తన ట్రేడ్ మార్క్ షాట్‌తో అలరించాడు. భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా స్కాట్ బోలాండ్ వేసిన 17వ ఓవర్‌లో రివర్స్ పుల్ షాట్‌తో బౌండరీ రాబట్టాడు.
ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదెక్కడి షాట్ అయ్యా పంత్.. అంటూ కామెంట్ చేస్తున్నారు. అసంబద్దమైన షాట్స్ ఆడటంలో పంత్‌ను మించినోడు లేడని కామెంట్ చేస్తున్నారు. ఈ ఓవర్ మూడో బంతిని స్కాట్ బోలాండ్ వేయకముందే పంత్ తన స్టాన్స్‌ను మార్చుకోగా.. అతను బౌన్సర్ సంధించాడు. ఆ బౌన్సర్‌ను పంత్ అద్భుతంగా పుల్ షాట్ ఆడి బౌండరీ రాబట్టాడు.

టెస్ట్ బుక్‌లో లేని ఈ షాట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. అటాకింగ్ గేమ్‌తో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కీలకమైన విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. ఎలాంటి బెరుకు లేకుండా తొలి బంతినే బౌండరీకి తరలించాడు. మరో ఎండ్‌లో గిల్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన రోహిత్ తడబడినా.. పంత్ మాత్రం స్వేచ్చగా బౌండరీలు బాదుతున్నాడు. తనకే సాధ్యమైన ర్యాంప్ షాట్స్‌తో కిందమీద పడుతూ.. వరుస బౌండరీలతో వేగంగా పరుగులు రాబడుతున్నాడు.
ఆసీస్ 337 ఆలౌట్..
ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. 86/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది.
ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/98), జస్‌ప్రీత్ బుమ్రా(4/61) నాలుగేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
పోరాడుతున్న భారత్..
157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్(24), కేఎల్ రాహుల్(7), విరాట్ కోహ్లీ(11), శుభ్‌మన్ గిల్(28) మరోసారి నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది.