తమ సొంతగడ్డపై భారత్‌తో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-1తో గెలుస్తుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు.
ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన గత రెండు సిరీస్‌లను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2-2తో సమమవ్వగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ రిటైన్ చేసుకుంది.

ఇంతకుముందు బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఉండేవి. కానీ ఈ ఏడాది నుంచి ఐదు టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు. 'ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయం. గత రెండు సిరీస్‌ల ఫలితాల నేపథ్యంలో సొంతగడ్డపై ఆసీస్ తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటి నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహిస్తుండటం సిరీస్‌లో మరో కీలక పరిణామం. ఐదు మ్యాచ్‌లతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. డ్రాలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలియదు. కానీ ఆసీస్ గెలవాలని కోరుకుంటున్నా. నేనెప్పుడూ ఆసీస్ గెలిచేందుకే సలహాలిస్తా. వ్యతిరేకంగా పనిచేయను. ఏదో ఒక మ్యాచ్ డ్రా కావచ్చు. లేదా ప్రతికూల వాతావరణం ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ సిరీస్‌ను ఆసీస్ 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు తొలి టెస్ట్.. డిసెంబర్ 6-10 వకు అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్, డిసెంబర్ 14-18 వరకు బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్ట్, డిసెంబర్ 26 నుంచి 30 వరకు బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది.