టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్.. స్వదేశంలో ఓ ద్వైపాక్షి టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ సరసన నిలిచాడు. 2016లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.
9 వికెట్ల ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రవి బిష్ణోయ్.. సౌతాఫ్రికా పర్యటనలో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టానని తెలిపాడు. 'ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో నేను దారుణంగా విఫలమయ్యాను. ఆ తర్వాత నా ప్రణాళిక ప్రకారం వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయడంపైనే ఫోకస్ పెట్టాను. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ విషయానికొస్తే అక్కడ పిచ్‌లు, వాతావరణం భిన్నంగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తాను.' అని బిష్ణోయ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్‌డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.
త్వరలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10న ప్రారంభం కానున్న ఈ మూడు టీ20ల సిరీస్‌లో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.