
ఇండోర్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా భారత జట్టుకు ఇచ్చిన 6 రోజుల సెలువులు ముగిసాయి. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో బీసీసీఐ.. భారత ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లి ఫ్యామిలీతో గడిపారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ సన్నాహకాలను ఆదివారమే ప్రారంభించనుంది. స్వస్థలాలకు వెళ్లిన భారత ఆటగాళ్లంతా ఈ రోజు ఇండోర్‌లో సమావేశం కానున్నారు. హోల్డర్ స్టేడియం వేదికగా తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సిరాజ్, మహమ్మద్ షమీతో పాటు జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.
ఇప్పటికే ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకున్న రోహిత్ సేన్.. సిరీస్ కైవసంపై కన్నేసింది. ఇండోర్ వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్( డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్, టెస్ట్‌ల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కనుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో 64.06 విన్నింగ్ పర్సంటేజితో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇండోర్ టెస్ట్ గెలిస్తే ఎలాంటి సమీకరణం లేకుండా ఫైనల్ చేరుతోంది. ఒకవేళ చివరి రెండు టెస్ట్‌ల్లో ఆసీస్ విజయం సాధించి.. న్యూజిలాండ్‌తో శ్రీలంక 2-0తో సిరీస్ కైవసం చేసుకుంటే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్ట్‌లు డ్రా చేసుకున్నా.. రోహిత్ సేనకు ఫైనల్ బెర్త్ ఖాయం అవుతోంది.
మరోవైపు వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియాతో భారత్‌ను ఎలాగైనా ఓడించాలనే కసితో రగిలిపోతుంది. భారత ఆటగాళ్లు విశ్రాంతి పేరిట ఇంటికెళ్లినా.. ఆసీస్ టీమ్ ఢిల్లీలో చెమటోడ్చింది. ప్రతీ రోజు 6-7 గంటలు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. గాయంతో డేవిడ్ వార్నర్, వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశం పయనమవ్వగా.. కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ జట్టులోకి వచ్చారు. స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. స్మిత్ సారథ్యంలో ఆసీస్ బలంగా కనిపించనుంది. ఏ మాత్రం తేలికగా తీసుకున్న భారత్‌కు నష్టం జరుగుతుందని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.