
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి పూర్తిగా చతికిలపడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్ట్‌కు ముందు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే గాయాలతో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టార్ పేసర్ జోష్ హెజల్ వుడ్ గాయాలతో జట్టుకు దూరం కాగా.. స్వదేశీ టోర్నీల కోసం అష్టన్ అగర్, మ్యాట్ రేన్‌షా తదితర ఆటగాళ్లు కూడా స్వదేశం పయనమయ్యారు. ఇక వ్యక్తిగత కారణాలతో రెండో టెస్ట్ ముగిసిన వెంటనే స్వదేశం వెళ్లిన కమిన్స్.. మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటానని క్రికెట్ ఆస్ట్రేలియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనారోగ్యంతో జీవితం చివరి క్షణాల్లో ఉన్న తన తల్లిని పక్కన ఉండి చూసుకునేందుకు ప్యాట్ కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది. కమిన్స్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ హోదాలో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్లకు 9 రోజుల బ్రేక్ లభించింది. దాంతో భారత ఆటగాళ్లకు 6 రోజులు సెలవులు ప్రకటించడంతో.. స్వస్థలాలకు వెళ్లారు. ఆసీస్ టీమ్ మాత్రం ప్రాక్టీస్ చేస్తోంది. ఫిబ్రవరి 28న ఇండోర్ వేదికగా భారత ఆటగాళ్లంతా సమావేశం కానున్నారు.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో 2-0తో ఆధిక్యంలో నిలిచి బోర్డర్ గవాస్కర్‌ను రిటైన్ చేసుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్న టీమిండియా.. మరో మ్యాచ్ గెలిచినా.. చివరి రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకున్నా ఎలాంటి సమీకరణాలు లేకుండా ఫైనల్ చేరుతోంది.
మరోవైపు తొలి రెండు టెస్ట్‌లకు సిద్దం చేసిన పిచ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కన్నెర్ర చేసింది. ఈ రెండు పిచ్‌లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. దాంతో మూడో టెస్ట్‌కు సిద్దం చేసే వికెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.