
నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 120) అసాధారణ పోరాటానికి తెరపడింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ రూపంలో లైఫ్ లభించినా రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. స్పిన్నర్లను రోహిత్ శర్మ సమర్థవంతంగా ఆడటంతో అతని వికెట్ కోసం శతవిధాల ప్రయత్నించిన కమిన్స్.. చివరకు తానే బంతిని అందుకొని ఫలితాన్ని అందుకున్నాడు.
కమిన్స్ వేసిన 80వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ స్లిప్ క్యాచ్ ఇవ్వగా.. స్టీవ్ స్మిత్ నేలపాలు చేశాడు. ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి రోహిత్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లింది. ఈ లాలిపాప్ క్యాచ్‌ను అందుకోవడంలో స్మిత్ విఫలమవ్వగా.. రెండు పరుగులు వచ్చాయి. బంగారం లాంటి అవకాశాన్ని స్మిత్ నేలపాలు చేశాడని కామెంటేటర్లు చెబుతుండగానే.. రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కమిన్స్ వేసిన ఆఫ్ స్టంప్ లెంగ్త్ బాల్ అతని ఆఫ్ వికెట్‌ను ఎగరగొట్టేసింది. రోహిత్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి బంతి దూసుకెళ్లింది. దాంతో స్టీవ్ స్మిత్ ఊపిరి పీల్చుకున్నాడు. రోహిత్ శర్మ వికెట్‌తో 6వ వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
77/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. రోహిత్‌కు అండగా నిలిచిన అశ్విన్ (23) ముర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ ఔటివ్వకపోయినా.. రివ్యూ తీసుకొని ఆసీస్ ఫలితం సాధించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(7)కు ఉచ్చు బిగించి పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(12)తో రోహిత్ మరో వికెట్ పడకుండా ఆడటంతో భారత్ 151/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో లంచ్ బ్రేక్ వెళ్లింది.

లంచ్ విరామం తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లీ (12) ముర్ఫీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో జోరు కనబర్చాడు. కానీ లయన్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో రోహిత్ పోరాడాడు. ఈ క్రమంలోనే ముర్ఫీ బౌలింగ్‌లో బౌండరీ బాది సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రోహిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
టెస్ట్‌ల్లో 9వ సెంచరీ బాదిన రోహిత్.. ఓవరాల్‌గా 43వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా తొలి సెంచరీ బాదిన రోహిత్.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శతకం బాదిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. ప్లేయర్‌గా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు బాదిన ఓపెనర్‌గా సచిన్(9) సరసన నిలిచాడు.