టీమిండియాలో తరుచూ ట్రోలింగ్‌కు గురయ్యే ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అతను స్టార్ బ్యాటర్ కేఎల్ రాహులే. అతనిపై వచ్చిన విమర్శలు మరే భారత ఆటగాడిపై రాలేదు. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అతనిపై మాజీ క్రికెటర్లు, నెటిజన్లు, అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు.
అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రతీ ఒక్కరు ప్రశ్నించారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలోనే అతను టీ20 ఫార్మాట్‌కు దూరమయ్యాడు. వన్డేల్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టెస్ట్‌ల్లోనే బెంచ్‌కే పరిమితమయ్యాడు. వరుసగా విఫలమైనా.. అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది.

అండగా నిలిచిన గంభీర్..
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లోనూ మిడిలార్డర్‌లో ఆడిన రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. పేలవ ప్రదర్శన కనబర్చినా.. రాహుల్‌ను ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. అంతేకాకుండా రాహుల్ వంటి ఆటగాడు మరే జట్టుకు లేరని, అతనిలా వికెట్ కీపింగ్, మిడిలార్డ్, ఓపెనర్‌గా రాణించే ఆటగాళ్లు చాలా అరుదు అంటూ గంభీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలను విని గంభీర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని కూడా కొందరు విమర్శించారు. కానీ తనపై టీమిండియా మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టుకున్నాడు. అచ్చొచ్చినా ఓవర్‌సీస్ కండిషన్స్‌లో తనకే సాధ్యమైన ఆటతో ఆకట్టుకున్నాడు. కడుపు కాలినోడికే ఆకలి విలువ తెలిసినట్లు.. పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ప్రతీ పరుగుకు చాలా విలువ ఇస్తూ ఓపికగా బ్యాటింగ్ చేశాడు.
ఆటతోనే సమాధానం..
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. తనను ట్రోల్ చేసే బ్యాచ్‌కు ఆటతో సమాధానం చెప్పాడు. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులే చేసినా అందులో రాహుల్ ప్రభావం చాలా ఎక్కువ. చాలా కఠినంగా ఉన్న పిచ్‌పై సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు.
అనూహ్య బౌన్స్‌తో పాటు స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో 74 బంతులు ఆడి భారత ఇన్నింగ్స్‌కు అడ్డుగోడగా నిలిచాడు. ముఖ్యంగా అతని డిఫెన్స్ అద్భుతం. ఒక్క బాల్ కూడా ఎడ్జ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడాడు. చివరకు అంపైర్ తప్పుడు నిర్ణయానికే అతను బలయ్యాడు. కానీ ఆసీస్ బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. రాహుల్‌లా ఆసీస్ బ్యాటర్లు కూడా ఆడలేకపోయారు. అంత సౌకర్యంగా అతను బ్యాటింగ్ చేశాడు.
రాహుల్ లేకుంటే కుప్పకూలేది..
ఆస్ట్రేలియా టాపార్డర్ మొత్తం... 85 బంతులు ఆడితే కేఎల్ రాహుల్ ఒక్కడే 74 ఆడాడు. అందులో లబుషేన్ లైఫ్ ఒకటి... లేదంటే ఆ జట్టు టాపార్డర్ 50 బాల్స్ కూడా ఆడేది కాదు. పిచ్ మీద బంతి 0.8 సీమ్ అయింది. సాధారణంగా ఆ పిచ్ మీద 0.5 మాత్రమే సీమ్ అవుతోంది. రెండో రోజు ఆటలోనూ బంతి 0.8 సీమ్ అయినా రాహుల్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదు.
నితీష్, పంత్ ఎక్కువ పరుగులు చేసినా ఆడింది తక్కువ బంతులే... రాహుల్ 74 బాల్స్ అంటే... 12 ఓవర్లపైనే ఆడాడు. రాహుల్ ఆడకుండా ఉంటే భారత్ మరోసారి 50 పరుగుల్లోపే ఆలౌటయ్యేది. టెస్ట్ క్రికెట్‌లో ఓవర్సీస్ పిచ్‌ల మీద రాహుల్ టెక్నిక్ చాలా అందంగా ఉంటుంది. ఫుట్ వర్క్, డిఫెన్స్ టెక్నిక్, కవర్ డ్రైవ్‌లు ప్రతీ ఒక్కటీ ఆకట్టుకునేలా ఉంటాయి. నితీష్ కుమార్ రెడ్డి, రిషభ్ పంత్, బుమ్రా కంటే రాహుల్ బ్యాటింగ్ కారణంగా టీమిండియాకు ఆధిక్యం లభించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.