సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఘోర పరాజయానికి గురైన టీమిండియా మరో ఆసక్తికర టెస్ట్ సిరీస్‌కు సిద్దమవుతోంది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ గెలవడం అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో కైవసం చేసుకుంటేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుతోంది.

రోహిత్ దూరం..
మరోవైపు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్‌కు ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ సిరీస్ గెలవడం కీలకం. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై 2018-19, 2020-21 సిరీస్‌లను కైవసం చేసుకుంది.
అయితే ఇటీవల ఆస్ట్రేలియా సూపర్ ఫామ్‌లో ఉంది. ఈ సిరీస్‌లోని ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. తన సతీమణి రితికా సజ్దే రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఆమె పక్కనే ఉండేందుకు రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా అతనికి అనుమతిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అభిమన్యు, రాహుల్ అట్టర్ ఫ్లాఫ్..
రోహిత్ శర్మ గైర్హాజరీ టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. అతని స్థానంలో ఓపెనర్‌గా ఎవర్నీ ఆడించాలి? అనేది టీమ్‌మేనేజ్‌మెంట్ తేల్చుకోలేకపోతుంది. కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. అందరి కన్నా ముందు అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు పంపించి భారత్-ఏ తరఫున బరిలోకి దింపింది. కానీ అతను రెండో ఇన్నింగ్స్‌ల్లో 4, 10 దారుణంగా విఫలమయ్యాడు.
రోహిత్ శర్మకు బ్యాకప్‌గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక టెస్టులో అభిమన్యు 7, 12 పరుగులే చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో అభిమన్యు 0, 17 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ ఇద్దరి పేలవ ఫామ్ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
గంభీర్‌కు తలనొప్పి..
పేస్‌కు అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్‌లపై కొత్త బంతిని ధీటుగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ఓపెనర్లు తడబడితే.. ఒత్తిడిలో మిగతా బ్యాటర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కడుతారు. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్‌కు జతగా ఎవర్నీ ఆడించాలనేదానిపై గౌతమ్ గంభీర్ తర్జనా భర్జనా పడుతున్నాడు.
అయితే శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా ఆడించి.. భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
తుది జట్టులోకి ధ్రువ్ జురెల్..
ఆస్ట్రేలియా-ఏతో తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న ధ్రువ్ జురెల్.. రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులతో క్రీజులో నిలిచాడు. ధ్రువ్ జురెల్‌ను మిడిలార్డర్‌లో బ్యాటర్‌గా ఆడించి గిల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించడమే ఉత్తమమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలా కాదని ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్‌లు ఆడిస్తే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు.