హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాటలతోనే అరంగేట్ర మ్యాచ్‌లో సత్తా చాటానని టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు. గంభీర్ మాటలతో తన నెత్తురు మరిగిందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌తో నితీష్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు.
ఫస్ట్ మ్యాచ్‌లోనే అసాధారణ ప్రదర్శనతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసి భారత తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37)తో కలిసి ఆదుకున్నాడు. రిషభ్ పంత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

గంభీర్ మాటలతో నెత్తురు మరిగింది..
ప్యాట్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ను అద్భుతమైన అప్పర్ కట్‌తో సిక్సర్‌గా తరలించాడు. తొలి రోజు ఆటకు ఈ షాట్ హైలైట్‌గా నిలిచింది. తొలి రోజు ఆట అనంతరం తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
గౌతమ్ గంభీర్ స్ఫూర్తిదాయకమైన మాటలతోనే మెరుగైన ప్రదర్శన చేశానని నితీష్ రెడ్డి చెప్పుకొచ్చాడు. తన బ్యాటింగ్ సందర్భంగా
గంభీర్ పంపిన మెసేజ్‌తో నెత్తురు మరిగిందని తెలిపాడు. దేశ సరిహద్దుల్లో సైనికుడిలా పోరాడాలని గంభీర్ ధైర్యం నింపడంతోనే తాను రాణించగలిగానన్నాడు.
తుపాకీ తూటాలకు తట్టుకొని..
'దేశ సరిహద్దుల్లో సైనికుడు ప్రత్యర్థుల తుపాకీ తూటాలకు తట్టుకొని నిలబడతాడు. ఓటమి ఒప్పుకోకుండా పోరాడుతాడు. నువ్వూ అలాగే చెయ్. బౌన్సర్ వస్తే భుజాల మీద నుంచి భారీ షాట్‌గా కొట్టేయ్. బౌన్సర్‌ను బుల్లెట్ మాదిరిగా భావించు. వాటిని తట్టుకొని నిలబడు. ఆ బాల్ వస్తే ఎదురు దాడికి దిగు'అని గంభీర్ తనకు సూచించాడని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
గంభీర్ తన మాటలతో బౌలర్లలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, కసిగా బౌలింగ్ చేసేలా మోటీవేట్ చేశాడని తెలిపాడు. 'బంతితో ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇవ్వండి. మాటలతో కాకుండా వికెట్లు తీసి మీ సత్తా ఏంటో నిరూపించండి.'అని గంభీర్ బౌలర్లకు సూచించాడన్నాడు.
గంభీర్ మాటలతో చెలరేగారు..
అతని మాటలతో తమ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారని.. అటాకింగ్ లెంగ్త్స్‌లో బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారని తెలిపాడు. గంభీర్ మెసేజ్‌తో తనకు నెత్తురు మరిగిందని, దాంతోనే కమిన్స్ బౌలింగ్‌లో బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో సిక్స్‌గా మలిచానని వివరించాడు. గంభీర్ తన మాటలతో బ్యాటింగ్, బౌలింగ్‌ను నడిపించాడని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో సత్తా చాటింది. కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా(4/17), మహమ్మద్ సిరాజ్(2/17), హర్షిత్ రాణా(1/33) నిప్పులు చెరగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులే చేసింది. క్రీజులో మిచెల్ స్టార్క్(6 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) ఉన్నాడు.
భారత్@150
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు.